సూడాన్‌లో భారీ విషాదం చోటుచేసుకుంది. వెస్ట్ కోర్డోఫ్యాన్ ప్రావిన్స్‌లోని ఓ బంగారు గని మంగళవారం రాత్రి అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 67 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో గనిలో పనిచేస్తున్న పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. సూడాన్‌లోని పలు ప్రాంతాల్లో బంగారం తవ్వకాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అనధికారిక లేదా తక్కువ భద్రతా ప్రమాణాలతో జరిగే తవ్వకాల్లో ప్రమాదాల ముప్పు ఎక్కువగా ఉంటుందని నిపుణులు గతంలో హెచ్చరించారు.