ఖమ్మం జిల్లా చింతకాని మండలం తిమ్మినేని పాలెం సమీపంలో వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో 22 మంది కూలీలకు గాయాలయ్యాయి. తిమ్మినేనిపాలెంకు చెందిన వ్యవసాయ కూలీలు పత్తి తీసేందుకు నాగులవంచ గ్రామానికి వచ్చారు. సాయంత్రం స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా తిమ్మినేనిపాలెం మూలమలుపు వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను రెండు అంబులెన్స్ వాహనాల్లో ఖమ్మంలోని ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.