కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన E20 పెట్రోల్ (20% ఇథనాల్ కలిపిన పెట్రోల్) విధానంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ విధానం పేరిట ప్రభుత్వం సామాన్య ప్రజల జేబుల్లోంచి నేరుగా డబ్బులను దొంగిలిస్తోందని ఆయన ఆరోపించారు. E20 ఇంధనం వల్ల వాహనదారులకు మైలేజ్ తగ్గడమే కాకుండా, నిర్వహణ ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయని ఇది అత్యంత తీవ్రమైన అంశమని, దీనిపై కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని ఆయన స్పష్టం చేశారు.