రాష్ట్రవ్యాప్తంగా సూర్యుడు పగబట్టినట్లు నిప్పులు చెరుగుతున్నాడు. రోహిణీ కార్తె ప్రవేశానికి ముందే ఎండల తీవ్రత ఊహించని స్థాయికి చేరుకోవడంతో జనం అల్లాడిపోతున్నారు. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వడదెబ్బ కారణంగా 22 మంది మృత్యువాత పడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలు, నిరుపేదలు, వృద్ధులు ఈ వడగాడ్పుల బారిన పడి ప్రాణాలు కోల్పోతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.