మురసు తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతం అతలాకుతలమైంది. కొండవీటి వాగుతో పాటు కోటేళ్ల వాగు, ఎర్రవాగు, పాలవాగు, పేరమ్మ వాగులకు భారీగా వరద పోటెత్తడంతో రాజధానిని చుట్టుముట్టాయి. గత రెండు రోజులుగా రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో గుంటూరు నుంచి రాజధాని ప్రాంతానికి వెళ్లే ప్రయాణికులు తాడేపల్లి మీదుగా 35 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడింది. అమరావతి, క్రోసూరు, అచ్చంపేట మండలాల వైపు వెళ్లే సుమారు వంద గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.