అర్నబ్ తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా అతలాకుతలమైంది. మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు వంశధార, నాగావళి, మహేంద్రతనయ, బహుదా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం నాటికి నదులకు వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. సంతబొమ్మాళి మండలం మూలపేట, విష్ణుచక్రం ఆర్అండ్ఆర్ కాలనీలో వరదనీరు చేరింది. జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లో ఇంకా ముంపు కొనసాగుతోంది. టెక్కలి-నౌపడ రహదారిలో వరద నీరు ప్రవహిస్తోంది. ఆమదాలవలస మండలం నెల్లిమెట్ట గ్రామం జలదిగ్బంధంలోనే ఉంది. రెల్లిగెడ్డ ఉద్ధృతికి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.