కాకినాడ జిల్లా కత్తిపూడి వద్ద రోడ్డు ప్రమాదంలో నలుగురు భవానీ భక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. విజయనగరం జిల్లా డెంకాడ గ్రామానికి చెందిన భవానీ మాలధారులు విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి బస్సులో బయలుదేరారు. మార్గమధ్యలో కత్తిపూడి వద్ద సాంకేతిక లోపం రావడంతో బస్సు రోడ్డు పక్కన నిలిచిపోయింది. బస్సు ఆగడంతో కొందరు భక్తులు టీ తాగేందుకు రోడ్డు పక్కకు వెళ్లారు. ఆ సమయంలో వెనుక నుంచి అత్యంత వేగంగా దూసుకొచ్చిన ఒక స్కార్పియో కారు కాలినడకన వెళ్తున్న భక్తులను బలంగా ఢీకొట్టింది.

