హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు కీలక హామీలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల భద్రత కోసం ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు బ్యాంకర్లతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ప్రమాదాల్లో మరణించిన 45 మంది సింగరేణి కార్మికుల కుటుంబాలకు కోటి రూపాయల బీమా సొమ్ము అందించడంతో ఆ పథకం విజయవంతమైందని గుర్తుచేశారు. అదే నమూనాను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా విస్తరించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.