యూరప్ లో సినీ ఫక్కీలో సాగుతున్న మ్యూజియం దోపిడీల పరంపరలో మరో ఘటన వెలుగుచూసింది. ఆస్ట్రియాలోని ‘మ్యూజియం ఆఫ్ అప్లైడ్ ఆర్ట్స్’ లో శుక్రవారం పట్టపగలే భారీ చోరీ జరిగింది. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు సాధారణ సందర్శకుల్లా టికెట్లు కొనుగోలు చేసి లోపలికి ప్రవేశించి, సుమారు 200 క్యారెట్ల ప్లాటినం- వజ్రాల హారంతో ఉడాయించారు.
ముఖానికి ఎలాంటి ముసుగులు లేకుండా వచ్చిన దుండగులు ప్రదర్శన హాలులోకి వెళ్లి సుత్తితో డిస్ప్లే అద్దాల పెట్టెను పగులగొట్టి, ఆభరణాన్ని చేజిక్కించుకుని పరారయ్యారని పోలీసులు తెలిపారు.