ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతో ప్రధాని ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ ఆత్మీయ కలయికలో మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశానికి అందించిన విశిష్ట సేవలను ఆయన స్మరించుకున్నారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు తమ తరగతి గదుల్లో అమలు చేస్తున్న వినూత్న విద్యాబోధన పద్ధతులను ప్రధానితో పంచుకున్నారు. “నేను మీ స్టూడెంట్‌ని అనుకుంటే, మంచి వక్తగా ఎదగడానికి నాకు ఎలాంటి చిట్కాలు ఇస్తారు?” అని ప్రధాని అడగడంతో వాతావరణం మరింత ఆహ్లాదకరంగా మారింది.