మానవ ప్రాణాలకు, పర్యావరణానికి తీవ్ర ముప్పుగా పరిణమించిన ప్రమాదకరమైన ‘పారాక్వాట్’ గడ్డిమందును ప్రపంచవ్యాప్తంగా నిషేధించే ప్రక్రియ మరింత వేగవంతమైంది. తాజాగా, అగ్రరాజ్యం అమెరికాలోని వర్మాంట్ రాష్ట్రం ఈ గడ్డిమందుపై పూర్తి నిషేధం విధిస్తూ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. పారాక్వాట్ అనేది అత్యంత విషపూరితమైన రసాయనం. ఇది చాలా తక్కువ పరిమాణంలో శరీరంలోకి ప్రవేశించినా అంతర్గత అవయవాలు దెబ్బతిని ప్రాణాంతకంగా మారుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో క్షణికావేశంలో దీనిని తాగి బలవన్మరణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.