ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో భారీ వర్షాలు, వరదల కారణంగా బేతుపల్లి చెరువు ఉద్ధృతికి చిక్కుకుపోయిన ఏడుగురు మత్స్యకారుల్లో నలుగురిని కాపాడిన అనంతరం, మిగిలిన ముగ్గురిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అయితే, నీటి ప్రవాహం అదుపులేకుండా పెరగడంతో వారు ప్రయాణిస్తున్న రెండు రెస్క్యూ బోట్లు ప్రమాదవశాత్తు బోల్తా పడి, 10 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వరద నీటిలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు. నీటి తీవ్రత ఎక్కువగా ఉండడంతో వారి ఆచూకీ కనుగొనడం కష్టంగా మారింది.