తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. తొమ్మిదిరోజుల బ్రహ్మోత్సవాలకు ముగింపుగా చివరి రోజున బుధవారం శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల వరకు స్వామివారికి పల్లకీ ఉత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య భూవరాహస్వామివారి ఆలయ ముఖమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు.