ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక, విదేశాంగ విధానాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులకు అందించే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల సంఖ్యను కేంద్రం భారీగా తగ్గించడాన్ని ఆయన తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని లక్షలాది పేద కుటుంబాలు, మహిళలు మళ్లీ కట్టెల పొయ్యిలను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడిందని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు మేలు చేయాల్సిన పథకాలను కేంద్రం క్రమంగా నీరుగారుస్తోందని విమర్శించారు.

