లైంగిక వేధింపుల ఆరోపణలను కింగ్‌కోఠి శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత కళాశాల ప్రిన్సిపల్ పాండురంగ ముతాలిక్ ఖండించారు. 75 ఏళ్ల చరిత్ర కలిగిన కళాశాలకు చెడ్డపేరు తీసుకొచ్చేందుకే కొందరు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు అధ్యాపకురాలి తప్పులను ప్రశ్నించినందుకే తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, విధులకు సమయానికి హాజరుకాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోపాటు, విద్యార్థులను ఉత్తీర్ణులుగా చేసేందుకు డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఆమెపై ఉన్నాయని పేర్కొన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, నేరం చేసినట్లు రుజువైతే ఏ శిక్షకైనా సిద్ధమని స్పష్టం చేశారు.