దీపావళి వేడుకల తర్వాత దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. ఇవాళ (సోమవారం) ఉదయం 6:30 గంటల సమయానికి నగరంలో గాలి నాణ్యత సూచీ (AQI) 366కు చేరింది. ఇది ‘వెరీ పూర్’ (చాలా అధ్వాన్నం) కేటగిరీ కిందకు వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. పండుగ సందర్భంగా టపాసులు పేల్చడంతో గాలిలో కాలుష్య తీవ్రత పెరిగింది. నగరంలోని పలు ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో రోడ్లు సరిగ్గా కనిపించక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది.