చెత్త నుంచి సంపదను సృష్టించే మార్గాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. పల్నాడు జిల్లా కొండవీడులోని జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటును శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా చెత్త నుంచి విద్యుత్తును తయారు చేసే ప్రక్రియను, బాయిలర్లలో చెత్తను మండించే విధానాన్ని ఆసాంతం పరిశీలించారు. అనంతరం ప్లాంట్ అధికారులతో మాట్లాడి, వ్యర్థాల నిర్వహణ, విద్యుత్ ఉత్పాదనపై క్షుణ్నంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు.