విజయనగరంలోని ఘోష ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గర్భిణులు, బాలింతలు చలికి వణికిపోతున్నారు. వేడినీరు దొరకకపోవడంతో తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. చలికి తోడు పొగ మంచు ఎక్కువగా ఉండటంతో శిశువులకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రసవం తరువాత మహిళలకు వేడి నీళ్లు ఎంతో అవసరం. కానీ ఆసుపత్రిలో గీజర్లు లేకపోవడంతో చన్నీళ్లే దిక్కవుతున్నాయి. పసికందులను శుభ్రం చేయడానికి కూడా వేడి నీరు అందుబాటులో లేదు. వైద్యాలయం చుట్టుపక్కల పెద్దఎత్తున వేడినీళ్లు అమ్మే దుకాణాలు వెలిశాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.