జిల్లాలోని అశ్వాపురం మండలంలోని పాములపల్లి రథంగుట్టలో గల మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రంలో మూడు రోజులుగా క్లోరిన్ వాయువు లీకవుతోంది. అయితే ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. అటవీ ప్రాంతం కావడంతో మూడు రోజులుగా లీకవుతున్న ఈ విషవాయువును పీల్చుకున్న పాములు, కప్పలు, పలు కీటకాలు మృతి చెందాయి. ఈ వాయువు ప్రభావంతో మొక్కలు, చెట్లు మాడిపోయాయి. ఈ వాయువు చుట్టుపక్కల ప్రాంతాలకు చేరుకోవడంతో ఇద్దరు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు.