తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పర్వదినం సందర్భంగా ప్రత్యేక వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. నిత్యం వేలాది మంది భక్తులతో కిటకిటలాడే తిరుమల క్షేత్రంలో పండుగ రోజున ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానాన్ని ఆగమ సంప్రదాయాల ప్రకారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ మలయప్పస్వామివారితో పాటు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, విష్వక్సేనుల వారి ఉత్సవమూర్తులను బంగారు వాకిలి వద్ద గరుడాళ్వారు సన్నిధిలో వేంచేపు చేశారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర మంగళహారతులు సమర్పించారు.