రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అకస్మాత్తుగా విరుచుకుపడిన ఈదురుగాలులు, అకాల వర్షం పట్టణాన్ని గజిబిజి చేశాయి. ఎండ తీవ్రత మధ్య ఒక్కసారిగా ప్రచండ గాలులు తీవ్ర బీభత్సం సృష్టించాయి. గాలి వేగం పెరగడంతో రహదారులపైకి రేకులు, ఫ్లెక్సీలు ఎగిరిపడగా, భారీ వృక్షాలు నేలకూలి జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. గాంధీనగర్ ప్రాంతంలో ఈదురుగాలుల ధాటికి ఓ గోడ ఒక్కసారిగా కూలిపోవడంతో అక్కడ ఉన్న ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు తరలించారు.

