భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జయంతిని అధికారికంగా రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. సత్యసాయి బాబా సేవలు, ఆధ్యాత్మిక బోధనలు, సమాజానికి ఆయన అందించిన విశేష కృషిని భావితరాలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. నవంబర్ 23న సత్యసాయి బాబా జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సమాజంపై ఆధ్యాత్మికంగా చెరగని ముద్ర వేసిన మహనీయుడు సత్యసాయి అని కొనియాడారు.