చిత్తూరు జిల్లాలోని బైరెడ్డిపల్లి మండలం పాతపేట గ్రామంలో నిర్వహిస్తున్న బాటగంగమ్మ జాతరలో సోమవారం అపశృతి చోటుచేసుకుంది. జాతరకు వచ్చిన భక్తులకు పంపిణీ చేసిన శీతల పానీయం తాగిన అనంతరం సుమారు 70 మంది అస్వస్థతకు గురికావడంతో గ్రామంలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. బాధితుల్లో మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఉండటంతో కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వైద్య సిబ్బంది సకాలంలో చికిత్స అందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇద్దరి పరిస్థితి కొంత విషమంగా కనిపించడంతో వారిని బైరెడ్డిపల్లి పీహెచ్సీకి తరలించి ప్రత్యేక చికిత్స అందించారు.