ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రాయోజిత పథకాలు (సీఎస్ఎస్), నిధుల వినియోగంపై బుధవారం సచివాలయంలో కీలక సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రతి పైసాను వాడుకోవాలని, కొన్ని శాఖలు, జిల్లాల్లో నిధుల వినియోగంలో జాప్యం జరగడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఏడాది చివరలో కేంద్రం వద్ద నిధులు ఉండిపోతాయని, వాటిని సమర్థంగా వినియోగించుకోవడంలో వెనుకబడకూడదని స్పష్టం చేశారు. ఒకవైపు నిధుల కొరతతో ఇబ్బందులు పడుతుంటే, చేతిలో ఉన్న నిధులను ఖర్చు చేయకపోవడం సరైన పద్ధతి కాదని అధికారులకు హితవు పలికారు.

