రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో పారదర్శకంగా కొనుగోలు చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని, సన్న రకం ధాన్యానికి క్వింటాలు రూ.500 బోనస్ అందిస్తూ మద్దతు ధరకు కొనుగోళ్లు చేపడుతోందన్నారు. జిల్లా వ్యాప్తంగా 354 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అదనపు సాంకేతిక పరికరాలు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.

