యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రసాద తయారీ కోసం వినియోగించే విలువైన జీడిపప్పు, కిస్మిస్ వంటి డ్రైఫ్రూట్స్ను కొందరు ఉద్యోగులు అడ్డగోలుగా మాయం చేస్తున్నారు. ఆలయ గోదాముల్లోనే తిష్టవేసి, దేవస్థాన సరుకులతోనే వ్యక్తిగత ప్రయోజనాల కోసం దందాలు సాగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అత్యంత విస్తుగొలిపే అంశం ఏమిటంటే, నిబంధనలకు విరుద్ధంగా దేవస్థాన గోదాముల్లోనే కిలోల కొద్దీ ‘జీడిపప్పు పకోడీ’ తయారు చేస్తున్నారు. అత్యంత భక్తిశ్రద్ధలతో భక్తులకు అందించే ప్రసాద కవర్లలోనే ఈ పకోడీని ప్యాక్ చేసి, గుట్టుచప్పుడు కాకుండా బయటకు తరలిస్తున్నారు.

