ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల వివాదం గత కొద్దిరోజులుగా పెను సంచలనంగా మారింది. పేదల ఇళ్లను కూల్చివేయడంపై విపక్షాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడంతో ప్రభుత్వం చివరకు దిగిరాక తప్పలేదు. ఎక్కడైతే ఇళ్లు కూల్చివేతకు గురయ్యాయో, సరిగ్గా అదే ప్రాంతంలో సుమారు 9 ఎకరాల భూమిని లేఅవుట్ చేసి బాధితులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 311 మంది బాధితులకు ఒక్కొక్కరికి 75 గజాల చొప్పున ఇంటి పట్టాలను పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

