
ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం (1946 జూన్ 4 – 2020 సెప్టెంబరు 25) నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, టెలివిజన్ వ్యాఖ్యాత. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40 వేలకు పైగా పాటలు పాడారు. ఆయన పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఆయన్ను ఎస్పీబీ అని కూడా పిలవడం కద్దు. అభిమానులు ఆయనను ముద్దుగా బాలు అని పిలుస్తారు. 1966 లో పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది.