
ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదంలో మరణించలేదని, అయనది హత్యేనంటూ అమలాపురం లోక్‌సభ మాజీ సభ్యుడు జీవీ హర్షకుమార్ పిలుపు మేరకు శనివారం సాయంత్రం వేలాది మంది క్రైస్తవులు ప్రవీణ్ మరణించిన స్థలానికి ర్యాలీగా చేరుకున్నారు. కొవ్వొత్తులతో ర్యాలీ చేస్తుండగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. హర్షకుమార్‌తో పాటు పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. రాత్రి హర్షకుమార్‌ను పోలీసులు విడుదల చేశారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.