
సామాజిక బాధ్యతలో భాగంగా నేత్రదానానికి టీజీఎస్ఆర్టీసీ తోడ్పాటు అందిస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సేకరించిన నేత్రాలను ఉచితంగా తమ బస్సుల్లో హైదరాబాద్కు తరలించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ‘నెట్వర్క్ టు సైట్’ పేరుతో సరోజిని దేవి కంటి ఆస్పత్రితో టీజీఎస్ఆర్టీసీ ఒక ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్ మెహిదిపట్నంలోని సరోజిని దేవి కంటి ఆస్పత్రి ప్రాంగణంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మోదిని ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి పరస్పరం మార్చుకున్నారు.