తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో మళ్లీ ఆందోళన జ్వాలలు మొదలయ్యాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పటికీ, కార్మికుల సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదంటూ ఆర్టీసీ జేఏసీ నాయకులు యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చారు. సంస్థ ఎండీ అందుబాటులో లేకపోవడంతో ఆయన పేషీలో నోటీసులు అందజేసిన నేతలు, అనంతరం లేబర్ కమిషనర్ కార్యాలయంలోనూ వినతిపత్రం సమర్పించారు. నిబంధనల ప్రకారం నోటీసు ఇచ్చిన 14 రోజుల తర్వాత సమ్మె తేదీని అధికారికంగా ప్రకటిస్తామని జేఏసీ స్పష్టం చేసింది.

