అల్లాదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్, అధ్యాపకుల మధ్య ఏర్పడిన విభేదాలపై జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (డీఐఈఓ) మాధవి బుధవారం విచారణ నిర్వహించారు. ఇకపై కళాశాలలో ఇలాంటి సంఘటనలు జరగకుండా క్రమశిక్షణ పాటించాలని, తప్పిదాలు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కళాశాల ప్రిన్సిపాల్ సత్తయ్య తమను అకారణంగా వేధిస్తున్నారని అధ్యాపకుడు శంకర్ ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదుకు మద్దతుగా కొందరు గ్రామస్తులు కళాశాల వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

