
ఇజ్రాయెల్- హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ సెక్యూరిటీ కేబినెట్ ఆమోదముద్ర వేయడంతో ఈ ఒప్పందం సాకారం కానున్నదనే నమ్మకం అందరిలోనూ కలుగుతోంది. మూడు దశలలో అమలు కానున్న కాల్పుల విరమణ ఒప్పందం తొలి దశలో భాగంగా హమాస్ తమ చెరలో ఉన్న 33 మంది బందీలను విడుదల చేస్తే, ఇజ్రాయెల్ తమ జైళ్లలో బంధించిన పాలస్తీనియన్లలో కొందరిని వదిలిపెడుతుంది. రెండో దశలో గాజానుంచి ఇజ్రాయెల్ దళాలు వైదొలగుతాయి. ఆపై మూడో దశలో భాగంగా ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో గాజా పునర్నిర్మాణ కార్యక్రమం మొదలవుతుంది.