
అక్కినేని నాగేశ్వరరావు (1924, సెప్టెంబరు 20 – 2014, జనవరి 22) తెలుగు నటుడు, నిర్మాత. ఒక రైతు కుటుంబంలో పుట్టి, నాటకరంగం ద్వారా వెండితెర మీదకు వచ్చిన వ్యక్తి నాగేశ్వరరావు. తెలుగు సినిమా తొలినాళ్ళ అగ్రనాయకులలో ఒకడు. సుమారు 255 చిత్రాల్లో నటించాడు. నాటకాలలో స్త్రీ పాత్రల ద్వారా ప్రాముఖ్యత పొందాడు. ధర్మపత్ని సినిమాతో అతడి సినీజీవితానికి తెరలేచింది. అప్పటినుండి రకరకాల తెలుగు, తమిళ సినిమాలలో 75 సంవత్సరాలకు పైగా నటించాడు. ఎన్. టి. ఆర్తో పాటు తెలుగు సినిమాకి మూల స్తంభంగా గుర్తించబడ్డాడు.