బాంగ్లాదేశ్‌లో మైనారిటీల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. హిందువులపై దాడులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. తాజాగా డిసెంబర్ 31వ తేదీన షరియత్ పూర్ జిల్లాలో 50 ఏళ్ల ఖోకాన్ దాస్ అనే హిందూ వ్యక్తిపై ఉన్మాద మూక జరిపిన దాడి నాగరిక సమాజాన్ని నివ్వెరపరిచింది. బాధిత ఖోకాన్ దాస్ తన పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా.. ఒక గుంపు అతనిని చుట్టుముట్టింది. మారణాయుధాలతో విచక్షణా రహితంగా దాడిచేయడమే కాకుండా తీవ్రంగా గాయపడిన అతనిని సజీవ దహనం చేసేందుకు నిప్పు పెట్టారు. ప్రస్తుతం అతను కొన ప్రాణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

