
ఏటా శీతాకాలంలో ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరుతోన్న విషయం తెలిసిందే. అదే సమయంలో పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగులబెట్టడం దీనికి ఓ కారణమనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పంట వ్యర్థాల దహనంపై దాఖలైన పిటిషన్లపై తాజాగా మరోసారి విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీనికి పాల్పడుతున్న కొంతమందిని జైలుకు పంపితేనే మిగతా వారికి గట్టి సందేశం ఇచ్చినట్టు అవుతుందని వ్యాఖ్యానించింది.